విద్యాకానుకలో ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీని చేర్చాలని ముఖ్యమంత్రి YS జగన్ సంబంధిత
అధికారులను ఆదేశించారు. పాఠ్యపుస్తకాల నాణ్యత బాగుండాలని, విద్యార్థులకు
ఏర్పాటు చేసే బెంచ్‌లు సౌకర్యవంతంగా ఉండాలని పేర్కొన్నారు. మనబడి నాడు-నేడు
కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ.. ‘‘మొదటి దశ నాడు-నేడు పనులు మార్చికల్లా పూర్తి చేయాలి.
స్కూళ్ళు కలర్‌ఫుల్‌గా మంచి డిజైన్లతో ఉండాలి. స్కూళ్ళలో ఇంటీరియర్ కూడా
బావుండాలి. రెండో దశలో మరింత మార్పులు చేయాలి, విద్యార్ధులకు ఏర్పాటుచేసే
బెంచ్‌లు సౌకర్యవంతంగా ఉండాలి. పనుల్లో ఎక్కడా నాణ్యతా లోపం రాకూడదు. మనసా
వాచా కర్మణ నిబద్ధతతో పనిచేయాలి. అప్పుడే మనం అనుకున్న ఫలితాలు సాధిస్తాం. టేబుల్స్ విషయంలో మరింత జాగ్రత్త అవసరం, టేబుల్స్
హైట్ కూడా చూసుకోవాలి. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడో తరగతి వరకు
సీబీఎస్‌ఈ విధానంలో బోధన జరగాలి. ఆ తర్వాత ఏటా ఒక్కో తరగతికి పెంచుతూ
పోవాలి.అలా 2024 నాటికి 10వ తరగతి వరకు సీబీఎస్‌ఈ విధానం అమలు చేయాలి’’
అని మార్గనిర్దేశం చేశారు. అదే విధంగా 390 పాఠశాలల భవన నిర్మాణానికి
సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు
సురేష్, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య
కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు
చినవీరభద్రుడు, సమగ్రశిక్షా అభియాన్ ఎస్‌పిడి వెట్రిసెల్వి, ఇతర
ఉన్నతాధికారులు హాజరయ్యారు.